ఒత్తిడి మహాసముద్రంలో టెక్కీలు... చేతులు దులుపేసుకుంటున్న పేరెంట్స్

ఒత్తిడి మహాసముద్రంలో టెక్కీలు... చేతులు దులుపేసుకుంటున్న పేరెంట్స్
ఒత్తిడి మహాసముద్రంలో టెక్కీలు... చేతులు దులుపేసుకుంటున్న పేరెంట్స్

హైదరాబాద్‌‌లో ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన అశ్వనీ నాయర్ అనే ఉద్యోగిని మంగళవారం భవనం 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన సూసైడ్ నోట్ లో తాను ఏదో సాధించాలని అనుకున్నాననీ, కానీ ఏదీ సాధించలేకపోయాననీ, చచ్చిపోవాలనే ఆలోచనలు ఎక్కువయిపోతున్నాయని రాసుకుంది. అదే ఉత్తరంలో తన తల్లిదండ్రులు, సోదరికి క్షమాపణలు కూడా అడిగింది.

ఆమె చేస్తున్నది సాధారణమైన ఉద్యోగమేమీ కాదు. ఇంకా ఆమె ఆశించింది ఏమిటి..? ఇంతకు మించి ఏం సాధించాలని కలలు కన్నది..? అవి పెద్దలకు తెలుసా...? తల్లిదండ్రులు తమ కుమార్తె పరిస్థితిని ఎందుకు అంచనా వేయలేకపోయారు..? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పేరెంట్సే. అసలు ఇటీవలి కాలంలో చదువుల్లో మహామేధావులుగా ఉన్నటువంటి యువత రెప్పపాటులో ఆత్మహత్యలకు తెగబడటం మామూలయిపోతోంది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్... జీతం వేలల్లో కాదు. లక్షల్లోనే ఉంటుంది. రోజులో 5 రోజులు మాత్రమే పనిదినాలు. కానీ కదిలిస్తే మాత్రం నరకం అని చెపుతుంటారు కొందరు. అంత పని ఒత్తిడితో ఉద్యోగం చేస్తున్న యువతీయువకులు ఒంటరిపక్షుల్లా నగరాల్లో జీవితం వెళ్లదీస్తుంటారు. వారికి ఏ కష్టమొచ్చినా చెప్పుకునేందుకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రక్కనే ఉండరు. చాలా దూరంలో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉంటారు.

వృత్తిరీత్యా ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించలేక, అలాగని ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వస్తే... లక్షలు పోసి చదివిస్తే నువ్వు ఇలా తగలడ్డావేమిటని పెద్దలు పెట్టే చురకలను భరించలేక పిన్నవయసులోనే... ముఖ్యంగా అమ్మాయిలు ఈ ఒత్తిడి ప్రపంచంలో తమ శక్తికి మించిన ఒత్తిడిని తట్టుకోలేకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. లక్షలు పోసి చదివించి ఉద్యోగాలకు తరుముతున్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి మాత్రం పట్టించుకుంటున్నట్లు కనబడటంలేదు.

కేవలం చదువుకుని డబ్బు ఆర్జించే యంత్రాల్లా నేటి యువతను పేరెంట్స్ చూస్తున్నారా అనిపిస్తుంది. కనీసం పక్షం రోజులకయినా నగరాల్లో ఉద్యోగం చేస్తున్న తమ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారన్న సంగతిని కూడా పట్టించుకునే టైం లేకుండా పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు. ఎన్ని కోట్లు వెనకేశామని చూస్తున్నారు తప్పించి మన బిడ్డలకు ఎంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చాం, ఎలాంటి వాతావరణంలో వారు జీవిస్తున్నారన్న సంగతిని మాత్రం పట్టించుకోవడం లేదు.

కేవలం డబ్బు తెచ్చే హోదాలతో తృప్తి పడకుండా పిల్లల మనస్తత్వానికి తగిన ఉద్యోగాన్ని వెతికి చూసి వారిని జీవితంలో స్థిరపడేలా చూడాల్సిన బాధ్యత పెద్దలదే. అంతేతప్ప చదివించి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగంలోకి నెట్టేసి, మంచి జీతం, ఖరీదైన కారు, విలాసవంతమైన భవనం... అన్నీ సమకూరాయి... ఇక మన పని అయిపోయిందని చేతులు దులుపేసుకుని బిడ్డల్ని మహా ఒత్తిడి సముద్రంలో నెట్టకండి ప్లీజ్.

Comments

Popular posts from this blog

Sri Suguturu Gangamma Jatara Punganur | GANGAMMA JATHARA PUNGANUR

Kamidoddi gangamma jatara in 2016

Top Ten Techie Favorite Areas in Bangalore