Boyakonda Gangamma Temple story in Telugu
శ్రీ బోయకొండ గంగమ్మ
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14కి.మీ దూరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది. నవాబులు పాలన సమయములో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో తమసేనలతో దండయాత్రలు చేస్తూ అక్కడి జమిందారులను, పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేస్తున్న సమయమది. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై నవాబుల కన్నుపడింది.
గోల్కొండ నవాబు సైన్యాలు పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలు పెట్టారు. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరువైపు వస్తున్న నవాబు పదాతి దశాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివశించే బోయల, ఏకిల గూడేలలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఎందరో మహిళలు బలాత్కారానికి గురయ్యారు. పౌరుషంతో ఎదుర్కొన్న అనేకమంది బలయ్యారు. నవాబుసేనలు కూడా హతమయ్యారు.
మరలా గోల్కొండనుండి విస్తృతసేన పుంగనూరు చేరింది. ఈ విషయం తెలుసుకొన్న బోయలు, ఏకల దొరలు కొండ గుట్టకు వెళ్లి జగజ్జనిని ప్రార్థించారు. వీరి మొర ఆలకించి శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గ ధాటికి రాతి రాళ్లు సైతం నిట్టనిలువుగా చీలిపోయాయి.. (ఇప్పటికి కొండపై నిట్టనిలువుగా చీలి కనిపించే అతి పెద్ద రాయిని మనం దర్శించవచ్చు.) నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు ఒక మేకపోతును బలియిచ్చి తమతోపాటు ఉండమని ప్రార్థించారు.
వారి కోరిక మేరకు వెలసిన అమ్మవారిని "దొరబోయకొండ గంగమ్మ"గా పిలవడం అలవాటైంది. కొండపైన హిందువులు కట్టుకొన్న సిర్తారి కోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టక్రింద అమ్మ నీరు త్రాగిన స్థలం గుర్తులు రాళ్లకు సైన్యం గుర్తులు, ఉయ్యాల ఊగిన రాళ్లు అమ్మవారి మహిమలను శాశ్వత నిదర్శనాలు.
కొండపై వెలసిన అతి సుందరమైన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మటుమాయమవుతాయని, పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడలుతొలగుతాయని దుష్ట సంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.
బోయకొండ గంగమ్మకు సంతాన కల్పవల్లిగా పేరుంది. దక్షిణ భారతావనిలో ముఖ్యమైన శక్తి క్షేత్రంగా భసిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించ వలసిన క్షేత్రం.
Click here read more about Boyakonda Gangamma in English
Comments
Post a Comment